20, అక్టోబర్ 2010, బుధవారం

'అమీర్' ఖాన్

విలక్షణ నటనకు, కళాభిమానానికి, అభిరుచి గల నిర్మాతకు నిలువెత్తురూపం అమీర్ ఖాన్. ఎన్ని సినిమాలు చేసామనేది కాదు, ఎలాంటి సినిమాలు చేసాం, మంచి సినిమాలు ఎన్ని తీసాం అనేదానికి ప్రాధాన్యత నిస్తూ ఉత్తమ చిత్రాలు తీసి బాలీవుడ్ లో తనదైన ప్రత్యేక స్థానం పొందారు అమీర్. పేరులోనే కాదు చిత్రాల ఎంపికలో కూడా ఆయన అమీరే..
ఫనా, రంగ్ దే బసంతి, తారే జమీన్ పర్, గజని, త్రి ఇడియట్స్ సినిమాలు ఘనవిజయం సాధించి నటునిగా అమీర్ ఖాన్ లోని డిఫరెంట్ కోణాన్ని తెలియజేసాయి. గజిని చిత్రం కోసం ఏడాదిపాటు కష్టపడి కసరత్తులు చేసి కండలు పెంచిన అమీర్ ఖాన్, తర్వాతి చిత్రం త్రి ఇడియట్స్ కోసం కండలు తగ్గించి ఒక సగటు విద్యార్థిగా కనువిందు చేశాడు, విద్యారంగంలో మార్పులు తేవాల్సిన అవసరాన్ని చాటి చెప్పే చిత్రం తారే జమీన్ పర్. పిల్లల్ని ఆకట్టుకునే విధంగా, పెద్దల్లో మార్పు తెచ్చేలా సందేశాత్మకంగా తీసిన చిత్రంగా అందరి మన్ననలు పొందింది. ఇక ఈ సినిమాలో అమీర్ ఖాన్ నటన చిన్న పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకుంది.

అమీర్ నిర్మాత గా తాజా చిత్రం పిప్లీలైవ్ ఆస్కార్ బరిలో కూడా నిలిచింది. లగాన్ చిత్రం తర్వాత భారత్ తరపున ఆస్కార్ బరిలో నిలిచిన అమీర్ ఖాన్ రెండో చిత్రం ఇది. మనదేశంలోని రైతుల జీవితంలోని బాధలకు వ్యంగ్యాన్ని జోడిస్తూ కళ్లకు కట్టినట్లుగా చూపించిన చిత్రం పిప్లీ లైవ్. రైతులు అప్పల బాధల్లో చిక్కుకుంటే ఆదుకోని ప్రభుత్వం వారు చనిపోతే మాత్రం పరిహారం చెల్లిస్తానంటుంది. మీడియా కూడా బాధ్యతా రాహితంగా వ్యవహరిస్తూ టి.ఆర్.పి. రేట్లు పెంచుకునేందుకు సంచలన కథనాలకు ప్రాధాన్యతనివ్వడాన్ని ఈ చిత్రంలో దుయ్యబట్టారు. వీటన్నింటినీ వ్యంగ్యంగా చూపించారీ చిత్రంలో.
ఇక కథ విషయానికొస్తే పెప్లీ అనే గ్రామంలో ఇద్దరు రైతుల కథ. సరిగా పంటలు పండక అప్పుల బాధలో చిక్కుకున్న వీరు సహాయం కోసం ఊరి పెద్ద వద్దకు వెళ్తే.. ఆత్మహత్యలు చేసుకుంటే పరిహారం వస్తుందని ఓ ఉచిత సలహా ఇస్తాడతను. ఆ ఇద్దరిలో ఒకరు ఆత్మహత్యకు ప్రయత్నిస్తే మీడియా వ్యవహారశైలి, ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యంగ్య రూపమే పెప్లీ లైవ్.

కేవలం లాభాపేక్ష కోసం సినిమాలు తీయకుండా కొత్తదనం కోసం తాపత్రయపడటమే అమీర్ ఖాన్ సక్సెస్ సూత్రం. ఈ సక్సెస్ సూత్రం మన దేశానికి మరో ఆస్కార్ తెచ్చిపెడుతుందని ఆశిద్దాం..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి