22, సెప్టెంబర్ 2010, బుధవారం

గణపతి గోడు

డమరుక ధ్వనులతో, ప్రమద గణ నాట్యవిన్యాసాలతో కళకళలాడుతోంది కైలాసం.. కానీ ఆ సభలో ఏదో వెలితికొట్టొచ్చినట్టు కానవస్తోంది.. కారణం ఆదిదేవుడు గణపయ్య సభకు హాజరుకాకపోవడమే.. ప్రతి ఏడు భూలోకంలో తనజన్మదినోత్సవ వేడుకల విశేషాలను తల్లి పార్వతికి వివరించే బొజ్జ గణపయ్య ఈ ఏడు ఆ విశేషాలు చెప్పేందుకయినాసభకు రాలేదని పార్వతీదేవి తెగ ఆలోచించింది.. కాస్త ఆలస్యంగా వస్తాడని వెయిట్ చేసింది కూడా.. కాని ఆ గజముఖుడురాలేదు..
* * * * * * * * * *
పార్వతీదేవి: నాయనా.. కుమారస్వామి నీ అగ్రజుడు కనిపించడేమయ్యా..? భూలోకంలో భక్తులు పెట్టిన పులిహోర, ఉండ్రాళ్ల ప్రసాదాలు తిని ఆరోగ్యం మందగించలేదు కదా..?
కుమారస్వామి: లేదమ్మా.. అదేం లేదు బండరాళ్లనైనా అరాయించుకునే నా అగ్రజునికి భక్తుల ఉండ్రాళ్ల ప్రసాదాలేమిచేయగలవు, ఆరోగ్యమేమీ వికటించలేదమ్మా..?
పార్వతీదేవి: అయితే ఇంతకు భూలోకం నుంచి నా గణపతి వచ్చినట్టేనా..?
కుమారస్వామి: వచ్చాడమ్మా వచ్చాడు.. అన్నయ్యోచ్చాడమ్మా
పార్వతీదేవి: మరి వస్తే సభకు రాకపోవడానికి కారణమేమయ్యా (గుచ్చి గుచ్చి అడిగింది..?)
కుమారస్వామి: ఏమని చెప్పనమ్మా..? భూలోకం వెళ్లి వచ్చినప్పటి నుంచి అగ్రజుడు బాధగా కనిపిస్తున్నాడు.. తనలోతానే ఏదో బాధపడుతున్నాడు.. నాతో కూడా ఎక్కువగా మాట్లాడటం లేదమ్మా.. ఆ మూషికుని పరిస్థితి కూడా అంతేఉందమ్మా చెప్పాడు కుమారస్వామి..
* * * * * * * * * *
ఇక లాభం లేదని పార్వితీదేవే స్వయంగా గణేశుని మందిరానికి బయలుదేరింది.. వెళ్లే సరికే గణపయ్య దిగాలుగాకూర్చుని ఉన్నాడు.. గణేషుని ముఖం చూసేసరికి అర్థమయింది పార్వతిదేవికి. ఇది శరీర బాధ కాదు.. మనసు వ్యధఅని.. అవును మరి బిడ్డ బాధ తల్లికేగా తెలిసేది.. మానవమాత్రులైనా, దేవతలకైనా తల్లి తల్లే..
పార్వతీదేవి: నాయనా గణేషా.. ఏంటి సభా భవనానికి రాలేదు.. ఏమైంది నాయనా.. నీ బాధ ఏంటో నాకు చెప్పు
గణపతి మాట్లాడితేనా.. ఊహూ మాట్లాడలేదు..
పార్వతీదేవి: ఆ భూలోకపు ప్రసాదాలు తిని నీ ఆరోగ్యం వికటించలేదు కదా..
(అసలు విషయం అది కాదని ఆమెకు తెలుసు, కాని విషయం కనుక్కుందామని అలా అడిగింది..) అయినామాట్లాడలేదు గణపయ్య..
ఇంతలో ఓ మూలన కన్పించింది గజముఖుని వాహనం మూషికరాజు..
పార్వతీదేవి: ఓ మూషికమా నువ్వైనా చెప్పు.. అసలు విషయమేమిటో
మూషికుడు: అడిగింది తనను కాదు అన్నట్లు బుంగమూతి పెట్టుకు ఊరకున్నాడు
పార్వతీదేవి: ఇదిగో గణపతి.. నీలో నువ్విలా బాధపడుతుంటే ఎలా.. విషయం ఏంటో చెప్పు అని మళ్లీ లాలనగా బుజ్జగింపు
గణపతి: ఏమీ లేదమ్మా.. నా పుట్టినరోజున భూలోకంలోని అన్ని పందిళ్ల వద్దకు ఒకే సారి వెళ్లే టైమ్ లేకపోయింది.. అందునా నీవా రోజున స్పెషల్ వంటలు చేసావని నీ వద్దనే ఉన్నానా.. కైలాసం నుంచి నా భక్తులందరి ప్రసాదాలుస్వీకరించి వారందరిపై నా అనుగ్రహలు అందించానా..? అందుకే వెళ్లలేదు.. ఇక నిమజ్జనానికన్నా వెళ్దామని వేలాదిగా నాప్రతిమల నిమజ్జనం జరిగే హైదరాబాద్ కి వెళ్లానమ్మా..
పార్వతీదేవి: మంచిదేగా.. వెళ్తే ఏమయిందయ్యా..
గణపతి: ఏం కాలేదమ్మా.. చిన్నప్పటి నుంచి నా శరీరంతో నాకు బాధలేనమ్మా
పార్వతీదేవి: ఏం బాధలయ్యా ఆ శరీరంతో..
గణపతి: నా తండ్రి మొదలు నా శరీరమంటే అందరికీ చులకనేనమ్మా.. ఆ చవితి చంద్రుడితో సహా..
పార్వతీదేవి: అందుకేగా నాయనా నేనా చవితి చంద్రుడిని శపించింది
గణపతి: పుట్టిన కాసేపటికే నా తండ్రి పరమశివుడే తనను అడ్డగించానని నా శిరస్సు తీసేశాడా..
పార్వతీదేవి: అయితే ఏమయ్యా.. నేను ఆగ్రహించేసరికి ఆ స్థానంలో గజముఖం ఏర్పాటు చేశారుగా..
గణపతి: ఆ పెట్టారు లేమ్మా.. నా అందమైన శరీరానికీ ఏనుగు తల.. ఐనా తండ్రి కదా అని సరిపుచ్చుకున్నాను.. ఇప్పుడుకూడా...
పార్వతీదేవి: ఇప్పుడు ఎవరేం చేశారయ్యా..?
గణపతి: ఏం లేదమ్మా.. నా తండ్రి నా తల మార్చితే.. ఇప్పుడు నా శరీరాన్నే మార్చేస్తున్నారు..
పార్వతీ దేవి: ఎవరు నాయనా.. అంతటి ఘోరానికి పాల్పడింది..
గణపతి: ఇంకెవరమ్మా నా భక్తులు
పార్వతీదేవి: వారేంచేశారయ్యా..?
గణపతి: ఇంకే చేయాలమ్మా..? నిక్షేపం లాంటి నా శరీరం ఉండగా నా తలకు ఏవేవో వింత వింత ఆకారాలు తెచ్చిఅతికిస్తున్నారు..
ఏవో క్రికేట్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఒకటేమిటి వాళ్లకు నచ్చిన హీరోలు, యానిమేషన్ శరీరాలన్నీ నా శరీరానికిబదులు అతికిస్తున్నారమ్మా..

ఇక అంతేనా.. వినాయకుడు వివిధ రూపాలు అన్న పుణ్యానికి.. నరసింహావతారం, వామనావతారం, వరాహావతారం, శ్రీకృష్ణావతారం, పరశురామావతారం చివరకు వరహావతారం కూడా.. ఇలా దశవతారాలతో నా శరీరాన్నేమార్చేస్తున్నారమ్మా..
అంతేనా.. కాళభైరవుడు, సాయినాధుడు, హనుమంతుడు, కాళీయ కృష్ణుడు. గోవర్థనగిరి కృష్ణుడు, గోపికలతో కృష్ణుడు, గీతోపదేశ కృష్ణుడు, గోవింద రూపం ఇలా విభిన్న దేవతామూర్తుల శరీరాలను నా తలకు అతికించి పూజించారమ్మా..
నా బొజ్జ సంగతి నీకు తెలుసు కదమ్మా.. నాకు ఆ బొజ్జే అందం.. అలాంటి బొజ్జ ఏ మాత్రం లేకుండా సిక్స్ ప్యాక్ బాడీ, పహిల్వాన్ బాడీ తగిలించారమ్మా.. నన్ను నేను గుర్తుపట్టాలేకుపోతున్నా..
నా మీద భక్తులకు ఎంత భక్తి ఉన్నా కాని నన్నిలా కార్టూన్ పాత్రలా ఇష్టం వచ్చినట్లు మారుస్తారా..?
అసలే ఓ పక్క నేను ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ శరీరాలతో ప్రకృతి కాలుష్యానికి కారణం అవుతున్నానని బాధపడుతుంటే నాశరీరంతో ఇలా ఆటలాడుకుంటారా..?
ఇంతలో మూలనుంచి నేనూ ఉన్నానంటూ పరుగెత్తుకొచ్చాడు మూషికుడు
మూషికుడు: అంతేకాదు తల్లి.. స్వామివారు.. ఎంత బరువున్నా నేనే కదమ్మా మోసేది.. కానీ విచిత్రంగా నాకు బదులుగాకుమారస్వామి నెమలి వాహనం, బ్రహ్మ హంస వాహనం, పరమేశ్వరుని నందివాహనం, విష్ణుమూర్తి గరుడ వాహనం, అశ్వవాహనం, మీ సింహ వాహనం ఇవన్నీ కాక మోటారు వాహనాలపై కూడా స్వామి వారిని ఊరేగిస్తున్నారే కానీ నన్నుమాత్రం గుర్తించడం లేదమ్మా.. స్వామి వారికి నేనొక వాహనాన్ని ఉన్నానన్న విషయం కూడా మరచారమ్మా స్వామి వారిభక్తులు...
గణపతి: విన్నావు కదమ్మా.. మూషికుని బాధ.. నా శరీరానికి మార్పులు చేస్తున్నారీ భక్తులు.. ఏమన్నా అందామంటేవారంతా నా ప్రియ భక్తులే.. నా మీద ప్రేమ ఓ వైపు వారి ఫ్యాషన్లు, మరొక దేవుళ్లపై ఉన్న మమకారం మరోవైపు నాశరీరంలో బలవంతంగా జొప్పించి నా శరీరాన్ని ఈ విధంగా మార్చేస్తున్నారమ్మా..
పార్వతీదేవి: దీనికి పరిష్కారం ఏం చేద్దామనుకుంటున్నావు గణేషా..
గణపతి: ఈ ఏడు కొన్ని టీవీ ఛానళ్లలో మట్టి గణపతిపై ప్రచారం చేసి చాలా వరకు విజయం సాధించారు.. నా శరీరంపైనాక్కూడా మమకారం ఉంటుంది కదా.. అందుకే వచ్చే సంవత్సరానికి నేనే స్వయంగా రంగంలోకి దిగి వచ్చే ఏడుకైలాసంలో ఓ ప్రెస్ మీట్ పెట్టి నా ఆకారంలో ఉన్న ప్రతిమలే వాడాలని, నా వాహనాన్నే నాకు ఉపయోగించాలనిచెబుతామనుకుంటున్నాను.. అప్పుడైనా నా భక్తులు నన్ను నా రూపంతోనే కొలుస్తారేమో..?
పార్వతీదేవి: ఆ లైవ్ ప్రెస్ మీట్ చూడని భక్తుల సంగతి నాయనా..
గణపతి: ఎలాగూ మన తెలుగు టీవీ ఛానళ్ల వారు 24 గంటలూ దాన్నే మళ్లీ మళ్లీ చూయిస్తారమ్మా.. లేకుంటే 3 నెలలముందు నుంచే అరగంట వచ్చే రుద్రాక్షల యాడ్ లాగా నేనూ ఓ యాడ్ చేయిస్తాను.. అయినా నా భక్తులు నా
వింటారమ్మా.. నా భక్తులు నా మాట ఖచ్చితంగా వింటారు.. నన్ను నా రూపంలోనే కొలుస్తారు

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
- వినాయకుణ్ణి వినాయకుడిగానే కొలుద్దాం.. మన ప్యాషన్లు, మితి మీరిన క్రియేటివిటి వినాయకుడి పై ప్రయోగించొద్దు..
- మీ రామ్ పమ్మి

2 కామెంట్‌లు:

  1. మూషికుని బాధ.. నా శరీరానికి మార్పులు చేస్తున్నారీ భక్తులు.. ఏమన్నా అందామంటేవారంతా నా ప్రియ భక్తులే.. నా మీద ప్రేమ ఓ వైపు వారి ఫ్యాషన్లు, మరొక దేవుళ్లపై ఉన్న మమకారం మరోవైపు నాశరీరంలో బలవంతంగా జొప్పించి నా శరీరాన్ని ఈ విధంగా మార్చేస్తున్నారమ్మా..


    చేగువేరా ఆత్మ ఎంత ఘోషిస్తూ ఉంటుందో..

    good post.

    రిప్లయితొలగించండి