7, సెప్టెంబర్ 2010, మంగళవారం

ఆ కళ్లు

అసలే సోమవారం, ఆ పైన కార్తిక మాసం కావడంతో కాబోలు ఆలయమంతా హడావుడిగా భక్తుల సందడితో కిక్కిరిసి ఉంది. కానీ ఆ సందడిలో ఓ రెండు కళ్లు మాత్రం ఎవరి కోసమో వెతుకుతున్నట్లున్నాయి. అప్పటికే చాలా సేపటి నుంచి అతను ఆమె కోసం వెతుకుతున్నాడు.. ఏదీ కనపడదే.. ఇక తను నాకు దొరకదేమో అన్న భయం. ఆమె లేకుండా తానింకా ఎలా ఉండాలి అనే భవిష్యత్తు పై భయం అతడి కళ్లలో స్పష్టంగా కన్పిస్తున్నాయి. వచ్చీ పోయే వారందరినీ ఆతృతగా చూస్తున్నాడు.. వారిలో తను వెతికే దేవత కన్పిస్తుందేమోనని. అతని కళ్లు మాత్రం ఆమె జాడను కనిపెట్టలేకపోయాయి..

కానీ వారెవరూ మాత్రం అతని చూపులను అంతగా పట్టించుకోవడం లేదు. అరగంట కావస్తోంది.. అయినా ఆ కళ్లకు ఆమె కనపడలేదు.. ఊపిరి కొట్టుకోవడంలో వేగం పెరిగింది.. ఆలోచనలు తనకేదో ఆపద ఉందని హెచ్చరిస్తున్నాయి. దుఃఖం సునామి వరదలా కట్టలు తెంచుకు ముంచుకొస్తోంది. ఇక ఆగలేక పోయాడు.. తనపై ఇన్నాళ్లుగా ఎంతో ప్రేమ కురిపించి తనను ఎంతో ఆప్యాయతగా చూసుకున్న ఆమె ఇక కనపడదేమో అనే భయం అతని కన్నీళ్లను మరింత ఉద్ధృతం చేస్తోంది. వెక్కి వెక్కి ఏడ్వనారంభించాడు.. కానీ ఎవరూ పట్టించుకోరే అంతేలే.. ఈ బిజీ జీవితాలకు ఆ దుఃఖం విలువ ఏం తెలుస్తుంది. అంతటి దుఃఖంలో కూడా ఓ ఆశ ఇంకా తను కనపడుతుందని. మరోవైపు తననెవరూ పట్టించుకోవం లేదనే బాధ. అంతకు ముందెప్పుడు అతని మనస్సు ఇలాంటి చిత్ర పరిస్థితి ఎదుర్కోలేదు.

కొద్దిసేపటి నుంచి తదేకంగా ఓ పూజారి మాత్రం తననే గమనిస్తున్నాడు.. భక్తుల కోలాహలం, గుడిగంటల మోతల మధ్య ఒక్కసారిగా దేవుడిలా కన్పించాడు. అవును మరి పూజారి గుడిలో ప్రత్యక్ష దైవమంటారు. పూజారిని చూసి దుఃఖం ఆపుకోలేక దిగమింగుతున్నాడతను. అప్పటికే కొద్ది సేపటిగా అతన్నే గమనిస్తున్న పూజారి మార్కండేయులుకు అనుమానమొచ్చింది.

దగ్గరగా వెళ్లి ఏమిటి బాబూ.. చాలా సేపటి నుంచి నిన్నే గమనిస్తున్నా.. ఏంటి విషయం. నీవు ఎవరి కోసమో ఎదురు చూసున్నట్లున్నావ్? అన్నాడు పూజారి.. ఆ మాటలకు ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది.. ఏడుస్తూ తన గోడు వెళ్లబోసుకున్నాడు..

ఇంతలోనే దేవాలయ మైకులో ఓ ప్రకటన వినపడింది.. ’’ఆకు పచ్చ రంగు చొక్కా, నలుపు రంగు నిక్కరు వేసుకున్న ఏడు సంవత్సరాల అనీల్ అనే బాలుడు తన తల్లితో దేవాలయానికి వచ్చి తప్పిపోయాడు.. ఎవరికైనా కనబడితే దేవాలయ ముఖద్వారం వద్ద బాలుడి తల్లికి అప్పజెప్పగలరని విజ్ఞప్తి’’

2 కామెంట్‌లు: