5, సెప్టెంబర్ 2010, ఆదివారం

హృదయపు సందేహం

నే చూడాలనుకున్నా..
తీర్చుకోవాలనుకున్నా..
నా ఆలోచనల మాటున
అణిగివున్న సందేహాలను

పగలు రాత్రి మధ్య..
గీతేమైనా ఉందాయని..
రాత్రంతా మేల్కొని చూశా..
కన్నులార్పకుండా కాపువేశా
కాని కానరాదే.. తెల్లారింది కూడా
అప్పుడే అర్థమైంది
భళ్లున తెల్లవారదు,
హఠాత్తుగా పొద్దుకూకదు.
పగలు రాత్రికి మధ్య గీతేమీ లేదని

మొగ్గ పువ్వుగా ఎలా వికసిస్తుందో..
వీక్షించాలనుకున్నా
దాని ముందే చాలా సమయం గడిపా
మొగ్గ వికసించిందే కాని..
నా హృదయపు సందేహం వికసించలేదు
అప్పుడే తెలుసుకున్నా అది హఠాత్పరిణామం కాదని

శిశిర వసంత రుతువుల మధ్య..
నిముషాన్ని వీక్షించాలనుకున్నా
చెట్లు చిగురించాయి వసంతం వచ్చేసింది
కాని ఆ నిముషం నే గుర్తించలేకున్నా

సముద్రపుటంచున నింగి, నీరు
కలిసిన చోటును వెతుకుతూ బయలుదేరా
నా పయనం సాగుతోంది..
కొనసాగుతోంది గమ్యం లేకుండా

5 కామెంట్‌లు:

  1. మీరేమీ అనుకోకుంటే ఓ చిన్న మాట అదే నా డౌటు కూడా "హఠాత్ మార్పు" అనరేమోనండి ఏదో సంధి వల్ల హఠాన్మార్పు అంటారేమో. పదమెక్కడా చదివినట్లులేదు కానీ ఎందుకో అలా అనిపిస్తోంది. కొంచెం చెబుతారూ...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు చెప్పినట్టు హఠాత్ మార్పు అన్న పదం తప్పు. అయితే హఠాన్మార్పు అన్న పదం కూడా తప్పే. ఎందుకంటే అలా సంధి చేయకూడదు. అది సంస్కృత సంధి కాబట్టి... హఠాత్ అనే పదం సంస్కృతం. మార్పు అనే మాట తెలుగు. కాబట్టి అలా కలపడం సరికాదు. హఠాత్పరిణామం అని సంస్కృతంలో అనచ్చు లేదా ఒక్కుమ్మడి మార్పు అని తెలుగులో అనాలి. లేదా మనకి అలవాటేగా... సడెన్ ఛేంజ్ అని ఇంగ్లిష్ లో అనేయచ్చు. ఏదేమైనా ఈ సంకరాలు వినడానికి ఇబ్బందిగా అనిపిస్తాయి. భాష పద్ధతి బాగా తెలిసినవాళ్లకి వ్యాకరణ మూలాలు తెలియకపోయినా ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది. బహుశా మీకు కలిగిన భావం కూడా అలాంటిదే. బహుశా హఠాన్మరణం లాంటి పదాలు అలవాటుగా చదవడం వల్ల మీకు ఇలా తెలిసి ఉండవచ్చు. ఏమంటారు?
      - వక్కలంక కిషోర్

      తొలగించండి
    2. కిషోర్ గారు.... మీ సూచన మేరకు హఠాత్ మార్పు అన్న పదాన్ని... హఠాత్పరిణామంగా మార్చడమైంది. మీరన్నట్టు హఠాన్మరణం వంటి పదాలు అలవాటుగా రాయడం వల్లే ఈ తప్పిదం జరిగింది. సరిదిద్దినందుకు ధన్యవాదాలు

      తొలగించండి